Saturday, 11 July 2015

మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు..

-  14న అన్ని మున్సిపల్‌ పట్టణాలలో సంఘీభావ కార్యక్రమాలు
-  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌రావు అరెస్టుకు డిమాండ్‌

మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న రాష్ట్ర వ్యాపిత సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో తీర్మానం ఆమోదించారు. ఒంగోలు సుందరయ్య భవన్‌లో శనివారం నాడు కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. సమావేశం ఆమోదించిన తీర్మానాలను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గపూర్‌ పత్రికలకు విడుదల చేశారు. మున్సిపల్‌ కార్మిక సంఘాలు జెఏసి ఇచ్చిన న్యాయమైన డిమాండ్స్‌ను వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని సిఐటియు విజ్ఞప్తి చేసింది.   కార్మికుల న్యాయమైన సమ్మె పోరాటానికి మద్దతుగా జులై 14వ తేదీన రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ పట్టణాలలో సిఐటియు ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించాలని కౌన్సిల్‌ సమావేశం పిలుపునిచ్చింది. ధరలు విపరీతంగా పెరిగినందున జీవన వ్యయం, అవసరాలు పెరగటంతో అనివార్యంగా వేతనాలు పెంచాలని మున్సిపల్‌ కార్మికులు కోరారని వివరించింది. పర్మినెంట్‌ కార్మికులకు 10వ పిఆర్‌సి కమిషన్‌ సిఫార్స్‌లను అమలు చేయాలని, 010పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టు మరియు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనం రూ.15,432 చెల్లించాలని, వారిని రెగ్యులర్‌ చేయాలని, ప్రతినెలా సకాలంతో వేతనాలు ఇవ్వాలని, గత అక్టోబరులో ప్రభుత్వమిచ్చిన హామీలను అమలు చేయాలన్న న్యాయమైన వారి డిమాండ్స్‌కు కౌన్సిల్‌ మద్దతు పలికింది. ఈ డిమాండ్స్‌పై కార్మిక సంఘాలు కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఏడాదిగా ప్రభుత్వంపై ఆందోళనలతో వత్తిడి తెచ్చినా స్పందించక పోవడంతో అనివార్యంగా సమ్మె చేయాల్సి వచ్చిందని తీర్మానం పేర్కొంది. సమావేశానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ పుణ్యవతి అధ్యక్షత వహించారు. ముసునూరు తహసిల్దార్‌ డి వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరావును వెంటనే అరెస్టు చేయాలని, పదవి నుండి తప్పించాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు నిజాయితీగా విధి నిర్వహించిన తహసీల్దార్‌ వనజాక్షికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

No comments:

Post a Comment