Monday, 6 July 2015

ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ విధానాలకు వ్యతిరేకంగా...

- సెప్టెంబర్‌ 2 సమ్మె జయప్రదానికి సన్నద్ధం కావాలి 
- సిఐటియు జిల్లా పూర్వపు అధ్యక్షులు విఎస్‌ పద్మనాభరాజు పిలుపు
బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా పూర్వపు అధ్యక్షులు విఎస్‌ పద్మనాభరాజు పిలుపునిచ్చారు. నండూరి ప్రసాదరావు భవనంలో ఆదివారం జరిగిన సిఐటియు నగర కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది గడిచిందన్నారు. ఎన్నికల ముందు దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా సంపద సృష్టించే కార్మిక వర్గానికి ఈ రెండు ప్రభుత్వాలు ఎన్నో వరాలు ప్రకటించాయన్నారు. ఆ మేరకు తమ తమ ఎన్నికల ప్రణాళికల్లోనూ పేర్కొన్నారని చెప్పారు. అధికార పగ్గాలు చేపట్టగానే తమ కర్కశమైన మొదటి దాడిని కార్మిక వర్గంపైనే ప్రారంభించారని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చిన నుంచి పదే పదే అచ్చేదిన్‌ (మంచిరోజులు) తీసుకు వచ్చారని చెబుతున్నారని, వాస్తవానికి కార్మికులకు గోరేదిన్‌ (చెడ్డరోజులు) ప్రారంభమయ్యాయని రుజువైందని ఆరోపించారు. మోడీ అడుగు జాడల్లోనే రాష్ట్రంలో చంద్రబాబు కార్మిక చట్టాల మార్పునకు పూనుకొని కార్మికులపై దాడి చేయడం మరీ ఘోరం అన్నారు.  కార్మిక చట్టాల సవరణలను వెంటనే విరమించాలని, ఎస్‌డిఐలను 26 శాతం నుంచి 50 శాతానికి పెంచటాన్ని ఆపాలని విన్నవిస్తే ''నోటితో మాట్లాడుతూ -నొసటితో వెక్కిరించినట్లు''గా మోడీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. కార్మిక సంఘాలతో సంప్రదించడకుండా, పార్లమెంటుతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్‌లతో ఎఫ్‌డిఐల ప్రవేశానికి తలుపులు బార్లా తెరవడం ద్వారా దేశ ప్రయోజనాలను విదేశాలకు తాకట్టు పెట్టడం జరిగిందని ఆరోపించారు. సమావేశానికి బి.జగన్‌ అధ్యక్షత వహించారు. 
సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ, తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్మిక నిబంధనావళి బిల్లు-2015ను ప్రతిపాదిస్తుందన్నారు. దీని ప్రకారం 1926 కార్మిక సంఘాల చట్టం, 1947 పారిశ్రామిక వివాదాల చట్టం, 1947 పారిశ్రామిక నియామక చట్టం మూడింటిని ఒకే చట్టంగా రూపొందించాలని గత ఏడాది ఫిక్కీ ప్రభుత్వాన్ని కోరిందన్నారు. యజమానులు, కార్పారేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే పాలకుల విధానం గనుక దాన్ని ఇప్పుడు బిల్లు రూపంలో పార్లమెంటు ముందుకు తేవడానికి కేంద్ర ప్రభుత్వం తహతహలాడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి భూములు బలవంతంగా సేకరించడానికి చట్ట సభల్ని పక్కన పెట్టి మూడు సార్లు భూ సేకరణ ఆర్డినెన్స్‌ తేవడానికి పూనుకోవడం ఈ ప్రభుత్వ వర్గ స్వభావాన్ని రుజువు చేస్తుందన్నారు. మరో ప్రక్క పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న కార్మికులను, ఉద్యోగులను అణచివేసే దుశ్చర్యలకు కూడా మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ఆరోపించారు. అందుకే కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాపితంగా ఉన్న కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఒక తాటిపై నిలిచి సెప్టెంబర్‌ 2న దేశ వ్యాపిత సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. నగరంలో ఉన్న ప్రతి కార్మికుని వద్దకూ సమ్మె సందేశం తీసుకెళ్లి కార్మికులందర్నీ సమ్మెలో భాగస్వాములను గావించడానికి సిఐటియు కార్యకర్తలంతా పట్టుదలగా కృషిచేయాలని జగ్గునాయుడు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment