Monday, 6 July 2015

పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ వర్కర్ల ఐక్యతతోనే హక్కుల సాధన, ప్రభుత్వ రంగానికి రక్షణ...

- మోడీ 'మేకిన్‌ ఇండియా' ఓ దగా...
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయడమే బిజెపి విధానం
- ట్రేడ్‌ యూనియన్లను ఐక్యం చేసి పోరాడాలని కార్మికవర్గానికి పిలుపు
- స్టీల్‌ కాంట్రాక్టర్‌ వర్కర్ల జాతీయ మహాసభలో తపన్‌సేన్‌, సిహెచ్‌ఎన్‌ఆర్‌

ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు, కార్మిక హక్కుల సాధనకు ఆయా కంపెనీల్లో పనిచేసే పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ వర్కర్ల మధ్య సమన్వయం ద్వారానే సాధ్యమవుతుందని, ట్రేడ్‌యూనియన్‌లను ఐక్యం చేసి భవిష్యత్‌లో పోరాటాలు సాగించాలంటూ సిఐటియు ఆలిండియా ప్రధాన కార్యదర్శి, ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌. నర్సింగరావు పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌లోని గురజాడ కళాక్షేత్రంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ, సిఐటియు సంయుక్త నేతృత్వంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల కాంట్రాక్ట్‌ వర్కర్ల మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 5, 6 తేదీల్లో ఈ మహాసభ జరుగుతుంది. తొలిరోజు ఆదివారం ఉదయం 11గంటలకు సభను ప్రారంభిస్తూ సిహెచ్‌ నర్సింగరావు స్వాగత ఉపన్యాసం చేయగా, వర్కర్లనుద్దేశించి తపన్‌సేన్‌ కీలకోపన్యాసం చేశారు. ఏ ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమమైనా హక్కుల సాధనకోసం మాత్రమే పనిచేయకూడదని, పరిశ్రమల పరిరక్షణ కోసం పోరాడాలని అలాంటి పోరాటాలు సిఐటియు నేతృత్వంలోనే జరుగుతున్నాయన్నారు. కార్మికవర్గానికి ప్రధాన శత్రువైన పెట్టుబడిదారీ వర్గం దేశ రాజకీయాల్లోకి జొరబడిందని, పరిశ్రమలను కాజేసేందుకు అధికార పీఠాలపై తమ పాలకులను కూర్చొబెట్టిందన్నారు. ఎన్‌డిఎ హయాంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల పీకనొక్కాలనుకునే బాపతైన బిజెపి నేడు మళ్లీ అధికారానికొచ్చి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేసేందుకు వ్యూహం రచించిందని, ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తామని చెప్పే మోడీ మాటలను కార్మికవర్గం నమ్మదన్నారు. కాంట్రాక్టు వర్కర్లు లేనిదే దేశంలో ఏ కంపెనీ ఉత్పత్తి, మనుగడ సాగించలేని స్థితి ఉందని, దీనివల్ల కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ వర్కర్ల హక్కులకోసం పోరాడడమేగాక, నిజవేతనాల కోసం బేరమాడే శక్తి కూడా పెరిగిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేసే పర్మినెంట్‌ వర్కర్లు కాంట్రాక్ట్‌ వర్కర్లను ఐక్యం చేసేందుకు, వారి సమస్యలపై ముందుండి పోరాడేందుకు ఏ రకమైన పాత్ర పోషించాలి? ప్రభుత్వరంగాన్ని ఎలా కాపాడుకోవాలన్న విషయాలపై ఈ మహాసభలో చర్చించాలని పిలుపునిచ్చారు. రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ వర్కర్ల మధ్య సమన్వయం అత్యంత ముఖ్యమన్న విషయం గుర్తించాల్సి వుందన్నారు. సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మికవర్గాన్ని ఐక్యం చేసేందుకు విశాఖ నగరంలో జరుగుతున్న ఈ మహాసభ ప్రేరణగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ లోగా కార్మికవర్గంలో విభజనను సృష్టించేందుకు పాలకవర్గాలు కులం, మతం, విచ్చలవిడి ప్రసార సంస్కృతిని ప్రేరేపిస్తున్నాయని, వీటిని ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. అటల్‌ పింఛన్‌లంటూ ప్రచారాన్ని బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ టీవీ, సినిమాల్లో చేపట్టడం చూస్తే సెలబ్రిటీల ద్వారా కార్మికులకు ఏదో ఒరిగిపోతుందన్న ప్రసారం చేయడం పెద్ద మోసపూరితమైనదన్నారు. ఇవన్నీ కార్మికవర్గంపై జరిగే దాడులేనని వీటిపై పర్మినెంట్‌ వర్కర్లు చైతన్యంతో కదిలి కాంట్రాక్టు వర్కర్ల సమస్యలతో జోడించేందుకు చొరవ చూపాలన్నారు. సమ్మె ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోని ప్రతి వర్కర్‌కూ, యావత్‌ ప్రజానీకానికి వివరించడంలో పర్మినెంట్‌, కాంట్రాక్టు వర్కర్లు విజయవంతంగా ప్రచారం చేయాలన్నారు. మోడీ చేసే 'మేకిన్‌ ఇండియా' ప్రచారంలో డొల్లతనాన్ని వివరిస్తూ... స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు మహాసభ దోహదపడాలన్నారు. 
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ వర్కర్ల హక్కుల సాధన, రక్షణ కోసం పర్మినెంట్‌ కార్మికులను నియమించడంలో విశాఖ స్టీల్‌లో సిఐటియు అగ్రభాగాన ఉందన్నారు. 1979లో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి పునాదులు పడ్డాయని, 1988 నాటికి మొదట దశ నిర్మాణం పూర్తయిందన్నారు. అప్పట్లో 40వేల మంది కార్మికులు దీంట్లో పనిచేసేవారన్నారు. ప్రస్తుతం 6.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి ఎదగడంలో కార్మికవర్గం పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. కాంట్రాక్ట్‌ వర్కర్ల సమస్యలపై చర్చించడానికి అప్పట్లో ఏ యాజమాన్యం ముందుకొచ్చేది కాదని, ఎన్నో పెద్ద సమ్మెలు చేయాల్సి వచ్చిందన్నారు. 1985లో బిల్డింగ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ పెట్టి పోరాడుతున్నప్పుడు గాయత్రి ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి కార్మికులపై కాల్పులు జరిపించి, 80 మంది నాయకులను అరెస్ట్‌లు చేయించారన్నారు. అయినప్పటికీ పోరాటాలు ఆగలేదన్నారు. పోరాటాల ద్వారానే కాంట్రాక్ట్‌ కార్మికులు తమ హక్కులను సాధించుకున్న చరిత్ర, అనుభవం ఇక్కడ ఉందన్నారు. భవిష్యత్‌ పోరాటాలకు అనుగుణంగా ఈ మహాసభలు చర్చిస్తున్నాయని ఆయన స్వాగతోపన్యాసం చేశారు. వేదికపై ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి పికె దాస్‌, ఉపాధ్యక్షులు విష్ణుమహంతి, స్టీల్‌ప్లాంట్‌ లేబర్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు కెఎం శ్రీనివాస్‌, అధ్యక్షులు పివిఎస్‌బి శ్రీనివాసరాజు, జాతీయ కార్యవర్గసభ్యులు తదితరులున్నారు. బెంగాల్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కాంట్రాక్ట్‌ వర్కర్లు హాజరయ్యారు.

No comments:

Post a Comment