Sunday, 5 July 2015

కార్మికవర్గంపై ముప్పేట దాడి...

-  విజయవాడ సదస్సులో బాసుదేవ ఆచార్య...

కార్మిక వర్గ ఐక్య పోరాటాల ద్వారానే పాలక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని, తద్వారా కార్మిక హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు ఆదివారం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను సమిష్టి పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని, సార్వత్రిక సమ్మెలో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలే కాకుండా ఆర్థిక, సర్వీసు రంగ సంస్థలు పాల్గొని తోడ్పాటునందించాలని వక్తలు కోరారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపి బాసుదేవ ఆచార్య మాట్లాడుతూ, 1991 నుండి బడా కార్పొరేట్‌ కంపెనీలకు ప్రభుత్వాలు దాసోహంగా మారాయని, తాజాగా కేంద్రంలో పాలన సాగిస్తున్న ఎన్‌డిఎ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఏకంగా కార్మిక వర్గ హక్కులను హరించే రీతిలో పాలన సాగిస్తోందని అన్నారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టేందుకు కార్మికవర్గంపై ముప్పేట దాడి ప్రారంభించిన ఎన్‌డిఎ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన నెలలోపు ప్రవేశ పెట్టిన బడ్టెట్‌లోనే కార్మికవర్గ సంక్షేమాన్ని విస్మరించి నిధుల్లో కోత పెట్టిందన్నారు. దేశ వ్యాప్తంగా కోటి మందికి పైగా ఉన్న స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకపోగా వాళ్ల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారన్నారు. ఎఐటియుసి జాతీయ కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్‌ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలపై 11 కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాలు సమర శంఖం పూరించాయన్నారు. ప్రధానంగా 10 చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ సాధన కోసం గత ఐదేళ్ల నుండి కార్మిక వర్గం పోరాడుతోందన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని తదితర డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్నా ప్రభుత్వాల్లో చలనం లేదన్నారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ, కార్మికవర్గ సంక్షేమాన్ని పాలకులు విస్మరిస్తున్నారన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ, శ్రమయేవ జయతే అంటూనే మరోవైపు శ్రామిక వర్గంపై పాలకులు దాడి చేస్తున్నారన్నారు. కార్మికవర్గ హక్కులను హరించేందుకు బిల్లులు పార్లమెంట్‌లో పెట్టడం కాదని, దేశ సంపదలో సగభాగం శాతం సంపన్న వర్గాల వద్దే ఉందని, పాలక ప్రభుత్వాలకు దమ్ముంటే సంపన్న వర్గ డబ్బును జాతీయం చేయాలని సవాల్‌ విసిరారు. సదస్సులో ఐఎఫ్‌టియు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌, హెచ్‌ఎంఎస్‌ జాతీయ నాయకులు సిహెచ్‌ శంకరరావు, ఐఎన్‌టియుసి నాయకులు క్రాంతి కుమార్‌, బిఎంఎస్‌ నాయకులు శరవణకుమార్‌, ఎఐయుఇయుసి నాయకులు కె రాధాకృష్ణ, ఐఎఫ్‌టియు నాయకులు ముక్తార్‌ బాషా, వైఎస్‌ఆర్‌ టియుసి రాష్ట్ర కన్వీనర్‌ పి.గౌతంరెడ్డి, ఎపిఎన్‌జీవోస్‌ నాయకులు ఎండి ఇక్బాల్‌ ప్రసంగించారు. సదస్సుకు అధ్యక్ష వర్గంగా ఎఐటియుసి రాష్ట్ర నాయకులు పిజె చంద్రశేఖరరావు, ఐఎన్‌టియుసి నాయకులు వెంకటసుబ్బయ్య, బిఎంఎస్‌ నాయకులు సత్యకుమార్‌, ఐఎఫ్‌టియు నాయకులు కె.రామారావు, హెచ్‌ఎంఎస్‌ నాయకులు జిఎన్‌ శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, ఎఐయుటియుసి నాయకులు కె సుధీర్‌, ఐఎఫ్‌టియు నాయకులు ప్రసాద్‌ వ్యవహరించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు ఆహ్వానం పలకగా ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాధ్‌ వందన సమర్పణ చేశారు.







No comments:

Post a Comment