Wednesday, 15 July 2015

పారిశుధ్య కార్మి‌కులు లేకుండా స్వచ్ఛభార‌త్ సాధ్యమేనా..?

భారత్‌ను స్వచ్ఛభారత్‌గా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్రమోడీ, స్వఛ్ఛాంద్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు గుప్పిస్తున్నా ఆ దిశగా పాలన సాగించడంలేదు. ప్రచారార్భాÛటమే తప్ప ఆచరణలో అమలు చేయడంలేదు. చీపుర్లు పట్టి స్వచ్ఛభారత్‌కు పిలుపునిస్తున్న పాలకులకు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమస్యలు పట్టకపోవడం విచారకరం. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆరు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రికి పట్టడం లేదు. స్వచ్ఛాంద్ర సాధిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న పాలకులకు పట్టణాలలో చెత్త కుప్పలు పేరుకుపోతున్నా చలనం రావడంలేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపల్‌ కార్మికులను నియమించడంలేదు. దీంతో కార్మికులపై పని ఒత్తిడి పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా కష్టపడి పని చేస్తున్నప్పటికీ కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు. నిత్యావసర ధరలు, చదువులకు ఫీజులు, వైద్యం ఖర్చులు పెరుగుతున్నప్పటికీ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదు. దీంతో అర్థాకలితో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, బీమా సౌకర్యం కల్పించాలని న్యాయ బద్ధమైన డిమాండ్లతో కార్మికులు సమ్మె చేపడుతున్నా పాలకులు పూర్తిగా పట్టించుకోవడం లేదు. కార్మికులు సమ్మె కొనసాగించడంతో రోడ్లపై చెత్త, కాలువలలో పూడికలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుంది. పెరిగిపోతున్న అపారిశుధ్యంతో వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నప్పటికీ పాలకులకు పట్టకపోవడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని ప్రజలు కోరుతున్నారు. 

No comments:

Post a Comment