Tuesday, 7 July 2015

అసంఘటిత రంగ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలి...

- సెప్టెంబర్‌ 2 సమ్మెలో ముఠా కార్మికులంతా భాగస్వాములు కావాలి
-  సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ పిలుపు
అసంఘటిత రంగ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2వ తేదీన అన్ని కార్మిక సంఘాల నేతృత్వంలో జరిగే సార్వత్రిక సమ్మెలో ముఠా కార్మికులంతా భాగస్వాములు కావాలన్నారు. కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌, గవర్నర్‌పేటలోని ఫ్లైవుడ్‌ , అద్దాల కంపెనీల్లో పనిచేసే ముఠా కార్మికుల సర్వసభ్య సమావేశాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్న ముఠా కార్మికులకు నేడు కనీస సౌకర్యాలూ పాలక ప్రభుత్వాలు కల్పించడం లేదన్నారు. వారి సంక్షేమం దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయన్నారు. కార్మిక హక్కులు కాలరాస్తూ , కార్మిక హక్కులను హరించే చర్యలకు దిగాయన్నారు. ప్రజలు, యూపిఎ ప్రభుత్వం సాగించిన అవినీతి పాలనతో విసుగుచెంది, గత్యంతరం లేక బిజెపి చేసిన వాగ్దానాలు నమ్మి ఆ పార్టీకి దేశంలో పూర్తి మెజార్టీ ఇచ్చారన్నారు. భాగస్వామ్య పక్షాలను కలుపుకుని బిజెపి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండి కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ కార్మిక వర్గంపై దాడి చేస్తూనే ఉందన్నారు. 1 శాతంగా ఉన్న సంపన్న వర్గాల సంక్షేమం కోసం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. బడ్జెట్‌లో సంపన్న వర్గాలకు 25 వేల కోట్లు పన్ను రాయితీలు ఇచ్చి, ప్రజలపై భారాలు వేసిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పెట్టుబడి దారులకు, కార్పొరేట్‌ శక్తుల కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలుగా మారాయన్నారు. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం కోసం, కార్మికులకు విద్య , వైద్యసదుపాయం, వృద్ధాప్యంలో రెండు వేల రూపాయల పింఛను ఇవ్వాలని తదితర డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. దీనిద్వారా కార్మికుల సత్తా పాలకులకు చాటాలన్నారు. సిఐటియు నగర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ పెరిగిన ధరల నేపథ్యంలో కార్మిక వర్గం రెండు పూటలా తిండిగింజలకు నోచక నానా ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను పట్టించుకోకుండా పాలకులు బడా వ్యాపార వేత్తల మెప్పుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి ప్రజా కంఠకపాలకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి ఉందన్నారు. సమావేశాల్లో ముఠా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నగర ప్రధాన కార్యదర్శి టి సుబ్బారెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎం సీతారాములు, అధ్యక్షులు ఎం బ్రహ్మయ్య,గౌరవాధ్యక్షులు వెల్లంకి మోహనరావు, అప్పలస్వామి, శ్రీరాములు, నర్సింహులు, లంకలపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment