Sunday, 12 July 2015

కార్మికవర్గం లేని పెట్టుబడిదారీ రాజ్యస్థాపనకు ప్రభుత్వాల ప్రయత్నం...

- సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌


దేశంలో, రాష్ట్రంలో కార్మికవర్గం లేని పెట్టుబడిదారీ రాజ్య స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గపూర్‌ విమర్శించారు. శనివారం ఒంగోలు సుందరయ్య భవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెబర్‌ 2న జాతీయ సమ్మె జరుగుతుందన్నారు. సమ్మెలో మండల స్థాయి కార్మికులు కూడా పాల్గొనేలా చేయడానికి సమావేశాలలో కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కార్మికవర్గంపై బిజెపి ప్రభుత్వం దాడి ప్రారంభించిందన్నారు. కార్మికుల చట్టాలను కుదించడం, కార్మికుల శ్రమను అప్పనంగా కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టడం, కార్మికుల సాంఘిక భత్రతా పథకాలను కుదించడం, కాంట్రాక్టు కార్మికుల చట్టాలను మార్చడం వంటి చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయని విమర్శించారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సమ్మెలను అనుమతించమని , సమ్మెలో పాల్గొన్న కార్మికునికి లక్షకు పైగా పైన్‌ వేసేలా చట్టంలో సవరణ చేస్తామంటూ వ్యాఖ్యానించారని విమర్శించారు. దేశంలోను, రాష్ట్రంలో ట్రేడ్‌యూనియన్‌ యాక్టివిటి జరగకుండా చేస్తామని కార్పొరేట్‌ కంపెనీలకు హామీ ఇచ్చారన్నారు. అందుకే కార్మికచట్టాలలో మార్పులు చేస్తున్నారన్నారు. దేశంలో సరళీకరణ ఆర్ధిక విధానాలు ప్రారంభించిన తరువాత 15 జాతీయ సమ్మెలు నిర్వహించినట్లు తెలిపారు. 16వ సమ్మెకు కార్మికులు సిద్ధ మవుతున్నారన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత తీవ్రంగా సెప్టెంబర్‌ సమ్మె జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పిఆర్‌సి ఆమోదించిన తరువాత పిఆర్‌సిలో కనీసవేతనం కాంట్రాక్ట్‌ కార్మికులకు వర్తింపజేసే అనవాయితీ మన రాష్ట్రంలో ఉందన్నారు. పిఆర్‌సి ప్రకారం కనీసవేతనం 13000 వరకు ఉందన్నారు. ఇంక్రిమెంట్లు, డిఎకలపి 15400 వరకు ఉందన్నారు. కాని ప్రభుత్వం పదివేలు ఇస్తామని చెబుతుందన్నారు. మున్సిపల్‌ కార్మికులకు పదివేల వేతనానికి అంగీకారం తెలిపితే రాష్ట్రంలో ఉన్న 2 లక్షల 70 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనం పదివేలే అవుతుందన్నారు. మున్సిపల్‌ కార్మికులకు 15400 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతామని చంద్రబాబు ప్రకటిం చారన్నారు.శాసనసభలో ఇచ్చిన హామీ ఇంత వరకు అమలు చేయలేదని విమర్శించారు.ప్రజాఉద్యమాలపై నిర్బందం విధిస్తున్నారన్నారు. ప్రభుత్వం విశాలంగా ఉండి ప్రజాసమస్యలను పరిష్కరించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ దీనికి విరుద్దంగా ఉందన్నారు. చంద్రబాబు ఎంతమందిని తొక్కేస్తారో తొక్కనీయండి మేము చూస్తా మంటూ అగ్రహం వ్యక్తం చేశారు. కార్మికవర్గ సహకారం లేకుండా ఏ ప్రభుత్వం తమ మనుగడను సాధించలేదని గుర్తు చేశారు. ముసునూరు తహశీల్దార్‌ను చంద్రబాబు బెదిరిస్తున్నారన్నారు.. తహశీల్దార్‌ పై దాడిచేసిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు తహశీల్దార్‌ విధులను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు, ప్రజలకు ఎలాంటి మెసేజ్‌పంపుతున్నారో అర్ధమవుతుందన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై శనివారం ఆర్ధికమంత్రితో చర్చలు జరిగాయన్నారు. పర్మినెంట్‌ చేయమని, మీరడిగిన జీతం ఇవ్వాలా అనే విధంగా మాట్లాడుతున్నారన్నారు. టిడిపి నాయకులను రోడ్లు ఊడ్చాలని పిలుపు ఇస్తున్నారన్నారు. రోడ్లు ఊడ్చటం కాదని కాల్వలను శుభ్రం చేయాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment