Saturday, 25 July 2015

సమ్మె పరిష్కారం...

-  రూ.2,700 వేతనం పెంపునకు అంగీకారం
-  నేటి నుండి విధుల్లోకి మున్సిపల్‌ వర్కర్లు
-  ప్రభుత్వ తీరు అభ్యంతరకరమైనా ఒప్పుకున్నాం
-  సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు

'ముందు సమ్మె విరమిస్తేనే చర్చలు.. సమ్మె చట్ట వ్యతిరేకం' అంటూ మున్సిపల్‌ కార్మికులకు హెచ్చరికలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. మున్సిపల్‌ కార్మిక సంఘ నాయకులను చర్చలకు శనివారం ఆహ్వానించింది. వారితో మంత్రివర్గ ఉప సంఘం సుదీర్ఘంగా చర్చించి, కొన్ని డిమాండ్లను అంగీకరించింది. దీంతో 16 రోజుల మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు తెరపడింది. మున్సిపల్‌ కార్మికుని కనీస వేతనం రూ.2,700 పెంచేందుకు నిర్ణయించింది. సమ్మె కాలాన్ని సెలవు కాలంగా పరిగణించేందుకు అంగీకరించింది. రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో శనివారం నాడు మున్సిపల్‌ కార్మిక సంఘ జెఎసి నాయకులతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం పలు దఫాలు చర్చలు జరిపింది. మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ.14,300కు పెంచాలని కార్మిక సంఘ నాయకులు పట్టుపట్టారు. గతంలోనే ప్రస్తుతం ఇస్తున్న జీతం రూ.8,300కు అదనంగా రూ.2 వేలు పెంచుతామని మంత్రివర్గ ఉపసంఘం తేల్చి చెప్పింది. శనివారంనాటి చర్చల్లో మరో రూ.700 పెంచి, మొత్తంగా రూ.2,700లు పెంచేందుకు ఒప్పుకుంది.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కార్మిక సంఘాలు ఒప్పుకోవాలని కోరింది. దీనిపై పలుమార్లు ఆలోచించిన కార్మిక సంఘ నాయకులు ఎట్టకేలకు ఒప్పుకున్నారు. పెంచిన జీతాలు రెండేళ్లకే వర్తిస్తాయనీ, పదో పిఆర్‌సి అమలు కానందున రెండేళ్లకోసారి జీతాలు పెంచా లని కార్మిక సంఘ నాయకులు కోరడంతో మంత్రి వర్గం అంగీకరించింది. మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ విభా గంలో పనిచేసే స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కేటగిరిలలో ఉన్న 40 వేల కాంట్రాక్టు కార్మికుల జీతాల విషయంలో, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఈ కేటగిరి ఉద్యోగుల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. వీరందరికీ ఒకేసారి జీతాల పెంపుదల విషయం కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు. పదహారు రోజుల సమ్మె కాలాన్ని సెలవు పీరియడ్‌గా పరిగణించేందుకు నిర్ణయించారు. ఈ సమ్మె కాలాన్ని తర్వాత పనిచేసేందుకు అంగీకారం కుదిరింది. 
మున్సిపల్‌ కార్మికుల జీతాలు 010 హెడ్‌పై ఇచ్చేందుకు త్వరలోనే తగిన ఏర్పాట్లు చేస్తామని ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రులు, కార్మిక సంఘ నాయకులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్చల్లో మంత్రి వర్గ ఉప సంఘం పక్షాన ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనగా కార్మిక సంఘ జెఎసి పక్షాన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, సిఐటియు గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి, కోశాధికారి జి.సుబ్బారావు, ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రావుల రవీంద్రనాథ్‌, మున్సిపల్‌ వర్కర్ల యూనియన్‌ కార్యదర్శి ఎ.రంగనాయుడు, వైఎస్‌ఆర్‌ సిపి ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు శివరామకృష్ణ, రవికుమార్‌, స్వతంత్ర మున్సిపల్‌ వర్కర్స్‌ యూని యన్‌ నాయకులు వి.రవి, ఎస్‌.శంకరరావు, జెఎసి నాయకులు మల్యాద్రి, సుబ్బారావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
రాష్ట్రంపై రూ. 150 కోట్ల భారం : మంత్రి యనమల 
మున్సిపల్‌ కార్మికులకు రూ.2,700 చొప్పున వేతనం పెంచడం వలన రాష్ట్రంపై రూ.150 కోట్ల ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మున్సిపల్‌ కార్మికులకు గతంలోనే రూ.2వేలు పెంచుతామని చెప్పామనీ, తప్పనిసరి పరిస్థితుల్లో మరో రూ.700 పెంచడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు తప్పవన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేసే స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌, కాంట్రాక్టు వర్కర్ల జీతాలు పెంచేందుకు త్వరలో కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుం టామన్నారు. రాష్ట్రంలో 70వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉన్నందున పెంచాల్సిన అవసరముందనీ తెలిపారు. కార్మికుల టిఎ, డిఎ, ఐఆర్‌ల విషయం చర్చించాల్సి ఉందన్నారు. సమ్మెకాలాన్ని గతంలో ఎన్‌జిఒలకు ఇచ్చినట్లుగానే సెలవులుగా పరిగణించనున్నట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాలు 010 హెడ్‌ ప్రకారం గతంలోనే ఇవ్వాలని భావించినా విజయవాడ, విశాఖపట్నాల్లో అమలు కాలేదనీ, అక్కడ కూడా అమలు చేయించి రాష్ట్రవ్యాప్తంగా 010 హెడ్‌ వర్తింపజే యనున్నామన్నారు. 
కార్మికవర్గం కోరినట్లు స్పందించలేదు : ఎఐటియుసి 
మున్సిపల్‌ కార్మికులు కోరిన విధంగా రాష్ట్రప్రభుత్వం స్పందించలేదని ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంధ్రనాద్‌ చెప్పారు. ప్రభుత్వం పెంచిన కొద్ది జీతాన్ని భారంతో పెంచామని చెప్పిందన్నారు. మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచకపోతే తిరిగి ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. 2014లో సమ్మె చేసిన జీతాలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల పట్ల వైఖరి మార్చుకోవాలనీ, నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలనీ డిమాండ్‌ చేశారు.


No comments:

Post a Comment