Sunday, 5 July 2015

కార్మిక హక్కుల పోరాట వేదిక...

- సిఐటియు రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవ సభలో బాసుదేవ్‌ ఆచార్య అభిభాషణ...
కార్మిక హక్కుల పోరాట వేదికగా సిఐటియు రాష్ట్ర కార్యాలయం ఉండాలని సిఐటియు ఉపాధ్యక్షులు బాసుదేవ్‌ ఆచార్య పిలుపునిచ్చారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సిఐటియు నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జెండాను యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ ఆవిష్కరించారు. యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి రోజా అధ్యక్షతన జరిగిన సభలో బాసుదేవ్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో యూనియన్‌ను బలపర్చుకోవడానికి అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటు చేసుకున్న నూతన కార్యాలయం అన్ని పోరాటాలూ నిర్వహించేందుకు వేదికగా ఉండాలని ఆకాంక్షించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సంఘటిత కార్మికులు యూనియన్‌లో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులను కూడా సమీకరించి వారి కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అసంఘటిత కార్మికులే ఎక్కువగా దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రస్థాయి కార్మిక సంఘాలను ఒకే వేదికపై తీసుకొచ్చి ఐక్య పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని సూచించారు. కార్మిక పోరాటాలను సామాన్య ప్రజల పోరాటాలుగా మార్చగలిగినప్పుడే ఇప్పుడున్న విధానాల్లో మార్పులొస్తాయని చెప్పారు. కార్మికవర్గ హక్కులను కాలరాస్తూ కేంద్రం ప్రభుత్వం 33 కార్మిక చట్టాలను కుదించి 5 చట్టాలుగా తీసుకొచ్చిందని పేర్కొన్నారు. 55 మంది అమరులు కావడం వల్ల బొగ్గు రంగం జాతీయం కాబడిందని, అలాంటి రంగాన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరించడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, విద్య, ఐసిడిసి వంటి సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులు ప్రభుత్వం తగ్గించిన విషయం ప్రజలు గుర్తించాలని సూచించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా పరిష్కార మార్గాలను మాత్రం ప్రభుత్వం ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న సమ్మె చేసే 11 కార్మిక సంఘాల్లో బిజెపి అనుబంధ సంస్థ బిఎంఎస్‌ కూడా ఉందని వెల్లడించారు.
యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ, రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో వరాలిచ్చి, తరువాత ప్రజలను విస్మరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వైఫై సేవలు అందిస్తామని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు 12 గంటలు పనిచేయాలని, అదే విధంగా మహిళ కార్మికులు రాత్రి పూట పనిచేసే విధంగా ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు ఉమామహేశ్వరరావు, ధనలకీë, నర్సింగరావు, స్వరూపరాణి, నాగేశ్వరరావు, సిపిఎం విజయవాడ నగర కార్యిదర్శి కాశీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు. యూనియన్‌ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి డివి కృష్ణ వందన సమర్పణ చేశారు.




No comments:

Post a Comment