Monday, 20 July 2015

మున్సిపల్‌ కార్మికులకు విపక్షాల బాసట...

- న్యాయం జరిగే వరకూ ఆందోళన
- రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించ డంలో ఒంటెత్తు పోకడ అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభు త్వం మెడలు వంచడానికి అన్ని పార్టీలూ సమైక్యం కావాల్సిన అవసరం ఉందని పలువురు విపక్షాల నాయకులు అభిప్రాయపడ్డారు. పారిశుధ్య కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమానవీయంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. వారికి న్యాయం జరిగే వరకూ జేఏసీ తీసు కునే భవిష్యత్‌ కార్యాచరణకు తమ సంపూర్ణ మద్ద తు ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఉద్యోగు లు, కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం సోమవారం నాడిక్కడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. మున్సిపల్‌ జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్య క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉద్యోగుల్లో అధిక శాతం దళితులే ఉన్నారన్నారు. వారికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కూడా అటకెక్కించిన ఘనత చంద్ర బాబు ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. గతే డాది ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిగి న సందర్భంలో మున్సిపల్‌ కార్మికులకు కూడా వేతనాలు పెంచుతామని చంద్రబాబు వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్‌ ఉద్యోగుల ఆందోళనను అణచివేయడానికి వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్ల ద్వారా కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అయినా సమ్మెను ఆపడం చంద్రబాబు తరం కాదన్నారు. సీఎం సత్వరమే కార్మికులతో సంప్రదింపులు చేయా లని, లేకపోతే నాలుగేళ్లపాటు రోడ్డుపై తిరిగే అవకాశాన్ని కోల్పోతారని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ సామాన్య ఉద్యోగుల చిన్నా చితక కోర్కెలు తీర్చలేని చంద్రబాబు సింగపూర్‌లాగా రాజధానిని మాత్రం కడతాడని ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ కార్మికులకు న్యాయం చేకూర్చే విషయంలో అవసరమైతే రాజమండ్రి వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య మాట్లాడుతూ పుష్కరాలకు 1600 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు అల్లాడుతుంటే వారి బాగోగులు పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడడంలో ఇప్పటి వరకూ ఎవరి తీరు వారిదిగానే ఉందని, తాజాగా అన్ని పార్టీలు కలవ డం స్వాగతించవలసిన విషయమన్నారు. బిజెపి నాయకులు ఎ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పుష్కరాల కార్యక్రమంలో హడావుడిగా ఉన్నా మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పట్టించుకుంటే బాగుండేదన్నారు. సమావేశంలో సిపిఐ ఎంఎల్‌ నాయకులు వీరబాబు, సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు మూర్తి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు గఫూర్‌, ఏఐటీయూసీ, సీపీఐఎంఎల్‌, ఐఎప్‌టీయూ, బీఎంఎస్‌,బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ పార్టీల నాయకులు మాట్లాడారు.

No comments:

Post a Comment