Wednesday, 8 July 2015

మున్సిపల్‌ సమ్మె తాత్కాలిక వాయిదా...

- జెఎసి నేతల వెల్లడి...
  మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు పెంపు, సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల ఏడో తేదీ అర్ధరాత్రి నుండి నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మెను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అభ్యర్థన మేరకు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల రాష్ట్ర ఐక్య కార్యాచరణ  కమిటీ(జెఎసి) నాయకులు తెలిపారు. జెఎసి నాయకులైన ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రంగనాయకులు తదితరులు విజయవాడ దుర్గాపురంలోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి నారాయణ సమ్మెను రెండురోజుల పాటు వాయిదా వేయాలని కోరారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి జపాన్‌ పర్యటనకు వెళ్లి ఉన్నందున.. స్వదేశానికొచ్చాక తొమ్మిదో తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలిసి జెఎసి నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి నారాయణ చెప్పారన్నారు. సమ్మెను వాయిదా వేయాలని మంత్రి, ఇతర ఉన్నతాధికారులు కోరినందున జెఎసి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయించిందన్నారు. వేతనాల పెంపు, రెగ్యులైజేషన్‌ తదితర సమస్యలపై మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, గతంలో రెండు పర్యాయాలు చర్చల పేరుతో ప్రభుత్వం ముఖ్యమైన డిమాండ్లపై కూడా చర్చ జరపకుండా దాటవేసిందని తెలిపారు. మంత్రి మాటతప్పితే తొమ్మిదో తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగాలని జెఎసి రాష్ట్ర నాయకత్వం తీర్మానించినట్లు నేతలు వివరించారు. విలేకరుల సమావేశంలో స్వతంత్ర సంఘం రాష్ట్ర నాయకులు ఎస్‌ శంకరరావు, బిఎంఎస్‌ రాష్ట్ర నాయకులు దశరధ రామరాజు, స్వతంత్ర సంఘం రాష్ట్ర నాయకులు వి.రవికుమార్‌, ఐఎన్‌టియుసి రాష్ట్ర నాయకులు గల్లా సునీల్‌కుమార్‌, గుంటూరు ఇంజనీరింగ్‌ విభాగ కార్మిక సంఘ నాయకులు వి.ప్రేమ్‌ సుధీర్‌, యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర నాయకలు ఎం.డేవిడ్‌, ఎస్‌.ఎల్లారావు, ఎ.లక్ష్మీ, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు జేమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment