Wednesday, 22 July 2015

పారిశుద్ధ్య కార్మికులపై ఏపీ సర్కార్‌ బ్రహ్మాస్త్రం...

 కార్పొరేట్ శక్తులకు పెద్దపీట... కార్మికుల మెడలపై కత్తిపీట... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరిది. కార్మికుల గొంతు నొక్కేందుకే చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. సమ్మెలు చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇస్తోంది. కార్మికులు మాత్రం పోరుబాట వీడమంటున్నారు. తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
మున్సిపల్ సమ్మెను ఉపేక్షించేది లేదు.....
మున్సిపల్ సమ్మెను ఉపేక్షించేది లేదు... విధుల్లో చేరితేనే కార్మికులతో చర్చలు... ఆంధ్రప్రదేశ్ సర్కార్ షరతులివి. చర్చలు జరపాల్సిన చంద్రబాబు ప్రభుత్వం... బెదిరింపులకు పాల్పడుతోంది. సమ్మెలను ఉపేక్షించేది లేదంటూ పంతాలకు పోతోంది. న్యాయపరమైన డిమాండ్ల కోసం పోరుబాట పట్టిన పారిశుద్ధ్య కార్మికులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది.
సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని తీర్మానం....
మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. సమ్మెను బహిష్కరించి విధుల్లోకి చేరితేనే చర్చలంటూ మెలిక పెడుతోంది. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని నిర్ణయించింది. ఈ విషయాన్నే ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. తమ విధానాన్ని చెప్పకనే చెప్పిన ఏపీ.... 
కార్మికుల పట్ల తమ విధానం ఏంటనేది..? ఏపీ కేబినెట్ చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. పాలకులు మారినా... ప్రభుత్వాలు మారినా... కార్మిక వ్యతిరేక విధానాలు మాత్రం మారడం లేదు. ఎన్నికలప్పుడు కార్మికులకు అండగా ఉంటానన్న చంద్రబాబు హక్కుల కోసం గళమెత్తిన కార్మికులపై కన్నెర్ర చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోరాడితే పోయేదేమీ లేదంటూ...పోరుబాట పట్టిన కార్మికులపై బ్రహ్మాస్త్రాలేంటంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన పి.మధు
మున్సిపల్ కార్మికుల పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తప్పుబట్టారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యను పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. బెదిరింపులకు గురి చేస్తే... ఊరుకునేది లేదంటూ మధు హెచ్చరించారు. ఇకపై అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష ఆందోళన చేపడుతామన్నారు.
ఏపీ సర్కార్ తీరుతో కార్మికవర్గం పిడికిళ్లు మరింతగా...
మొత్తానికి ఏపీ సర్కార్ తీరుతో కార్మికవర్గం పిడికిళ్లు మరింతగా బిగుసుకుంటున్నాయి. సర్కారు నిర్లక్ష్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి సమ్మె సాగుతున్నా... నిద్రపోతున్నట్లు నటిస్తున్న ప్రభుత్వ తీరుపై అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలంటున్నారు లేకుంటే మహోద్యమం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment