Monday, 29 June 2015

కదంతొక్కిన అంగన్‌వాడీలు...

జిల్లాల యంత్రాంగం..... తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రోడ్డెక్కారు. వేతనాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని నినదించారు. పౌష్టికాహారం పేరుతో లబ్ధిదారులకు ఇస్తున్న గుడ్లును రెండు నెలలుగా ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్సు యూనియన్‌ ఆధ్వర్యాన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఐసిడిఎస్‌ పీడీ చక్రధరరావుకు వినతిపత్రం అందజేశారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద సుమారు వెయ్యి మంది మహిళలు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కూ, ఐసిడిఎస్‌ పీడీకీ వినతిపత్రాలు అందజేశారు. ఏలూరులో జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది ముట్టడించారు. కర్నూలు జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. పెన్షన్‌తో సహా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతపురంలో ఐసిడిఎస్‌ పీడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు బైఠాయించారు. ఒంగోలులోని ఐసిడియస్‌ పీడీ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. కడప కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు నిరసన తెలుపుతూ సమస్యల్ని తక్షణమే పరిష్కాలించాలని నినాదాలు చేశారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట భారీ ఆందోళన కొనసాగింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను మార్చుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నేతలు హెచ్చరించారు. గుంటూరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. తొలుత కలెక్టరేట్‌ నుంచి పీడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్నాకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ జ్యోతిరాణి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మక్కెన మల్లిఖార్జునరావు ఆందోళనకు మద్దతుగా ప్రసంగించారు. అనంతరం పిడి నిర్మలకు సమస్యలపై వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వై.నేతాజి, సిహెచ్‌ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్‌ వద్ద ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి ఎ.కమల, అధ్యక్షురాలు పి.రజీనారాణి మాట్లాడారు.

No comments:

Post a Comment