- వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
మున్సిపల్ ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 26న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ(జెఎసి) నాయకులు తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎఐటియుసి కార్యాలయంలో శనివారం సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైనా సంఘటితంగా పోరాటం చేసేందుకు ఎఐటియుసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టియుసి అనుబంధ మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘాలు, వివిధ స్వతంత్ర సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ(జెఎసి)గా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయతలపెట్టాయన్నారు. 26న ఉదయం 10.30 గంటలకు హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగే ఈ రాష్ట్ర సదస్సులో ముఖ్యఅతిథులుగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బి.తులసేంద్ర పాల్గొంటారన్నారు.ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.15,432 చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ ఉద్యోగులకు జిపిఎఫ్ అకౌంట్లు, హెల్త్ కార్డులివ్వాలని, ఎన్‌ఎంఆర్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు కె.సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు, వివిధ స్వతంత్ర సంఘాల నాయకులు ఎస్.శంకరరావు, ఇ.మధుబాబు, దేశావత్ నరేష్ నాయక్(గుంటూరు) తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment