Wednesday, 24 June 2015

5న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి....

- సిఐటియు ఆధ్వర్యంలో పోస్టర్‌ ఆవిష్కరణ..

 సెప్టెంబర్‌ 2న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ జూలై 5న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సదస్సును కార్మిక, ఉద్యోగవర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు తూర్పుజోన్‌-1 కార్యదర్శి వి.గురుమూర్తి కోరారు. ఈ సందర్భంగా బుధవారం రాణిగారితోటలోని సిఐటియు కార్యాలయంలో రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు.గురుమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోడి, రాష్ట్రంలో సిఎం చంద్రబాబుల నేతృత్వంలోని ప్రభుత్వాలు కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. అనేక త్యాగాలు చేసి సాధించుకున్న చట్టాలను మార్పులు చేస్తూ ఉన్న హక్కులపై దాడి చేసే పనికి పూనుకుంటున్నాయన్నారు. సమస్యలు పరిష్కరించమని అడగటానికి వెళ్లిన కార్మిక సంఘాల నాయకులకు సమయం ఇవ్వని సిఎం చంద్రబాబు, సింగ్‌పూర్‌, జపాన్‌, మలేషియా, చైనా లాంటి దేశాలు పర్యటిస్తూ అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ పరుస్తుందని దుయ్యబట్టారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న జాతి సంపద అయిన ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటు రంగానికి దారాదత్తం చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వరకు ధరలు తగ్గిస్తామని ఉదరగొట్టిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నాయని పేర్కొన్నారు. కార్మిక హక్కుల సాధన కోసం దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న నిర్వహించే సమ్మెలో కార్మిక, ఉద్యోగ వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్‌ అధ్యక్షులు టి.చంద్రశేఖర్‌, నాయకులు భాను, డి.రమణ, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జోన్‌ కార్యదర్శి ఎస్‌.జ్యోతిబాస్‌, రిక్షా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఈదయ్య తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment