Saturday, 27 June 2015

సెప్టెంబర్‌ 2 సమ్మెను జయప్రదం చేయండి...

- సిఐటియు మద్దిలపాలెం జోన్‌ మహాసభలో ఆర్‌కెఎస్‌వి కుమార్‌

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 2న అఖిల పక్ష సంఘాల ఆధ్వర్యాన జరుగు సమ్మెను కార్మికవర్గ మంతా జయప్రదం చేయాలని సిఐటియు నగర కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలో జరిగిన సిఐటియు మద్దిలపాలెం జోన్‌ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికవర్గం ఎన్నో పోరాటాలు సాగించి సాధించుకున్న కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం మార్చివేసి కార్మికులకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయిస్తూ ఈ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పిఎఫ్‌ సొమ్మును షేర్‌ మార్కెట్‌లో పెడుతుందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. అసంఘటిత కార్మికులకు సమగ్రచట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సిమెంట్‌, ఇసుక ధరలను తగ్గించి, నిర్మాణ రంగంలో ఉపాధిని కాపాడాలన్నారు. సెప్టెంబరు 2న జరిగే సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు సహకరించాలన్నారు. సిఐటియు సీనియర్‌ నాయకులు అనపర్తి అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎ.సింహాచలం, జె.నాయుడు, డి.అప్పలరాజు, తులసీరాం, సిహెచ్‌ఎన్‌వి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఈ సభలో తోపుడు బండ్లు, ముఠా, ఆటో, జివిఎంసి, ఆర్టీసీ, బిల్డింగ్‌, యూనివర్శిటీ కార్మిక సంఘాలకు చెందిన 200 మంది కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు జోన్‌ కమిటీని 28 మందితో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎ.సింహాచలం, ప్రధాన కార్యదర్శిగా జె.నాయుడు ఎన్నికయ్యారు.

No comments:

Post a Comment