Friday, 26 June 2015

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు...

- 9న రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీల్లో సదస్సులు
- జూలై ఒకటి తర్వాత నిరవధిక సమ్మెకు సిద్ధం
- రాష్ట్ర సదస్సులో పలు తీర్మానాలు

 మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ. 15,432లకు పెంపు, ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ జీతాలు, పర్మినెంట్‌ ఉద్యోగులకు జిపిఎఫ్‌ అకౌంట్లు, హెల్త్‌కార్డులు, 010 పద్దు ద్వారా జీతాలు, ఎన్‌ఎంఆర్‌ కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌, ప్రమాద బీమా రూ. 5 లక్షలు తదితర డిమాండ్లను జులై 1లోగా పరిష్కరించాలని విజయవాడలో జరిగిన ఎపి రాష్ట్ర మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ(జెఎసి) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానించింది. 1లోగా పరిష్కరించకపోతే ఆరోజు తరువాత ఎప్పటినుండైనా సమ్మెకు దిగుతామని సదస్సు హెచ్చరించింది. సమస్యలు పరిష్కారం కోరుతూ జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం సమిష్టి పోరాటాలే ఏకైక మార్గమని పలు కార్మిక సంఘాలకు చెందిన రాష్ట్ర నాయకులు ఉద్ఘాటించారు. ఈనెల 29న అన్ని మున్సిపల్‌ పట్టణాల్లో సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 15 వేలు కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారన్నారు. కష్టించి పనిచేసే కార్మికులకు కనీస వేతనాలిచ్చేందుకు చేతులురాని పాలకులు, ఎంఎల్‌సి ఎన్నికల్లో ఒక్కో ఎంఎల్‌ఎను కొనుగోలు చేసేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బి.తులసేంద్ర మాట్లాడుతూ, కార్మికులకు పిఆర్‌సి విషయంలో అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. మున్సిపల్‌ కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కరమవుతాయన్నారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ, సెప్టెంబర్‌ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికులు పాల్గొనాలన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కార్మిక సంఘాల జెఎసి నాయకులను ఈనెల 29వ తేదీ సాయంత్రం మూడు గంటలకు చర్చలకు ఆహ్వానించినట్లు నాయకులు తెలిపారు. సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున మున్సిపల్‌ కార్మికులు తరలిరావడంతో హనుమంతరాయ గ్రంథాలయం కిక్కిరిసిపోయింది. సిఐటియు నాయకులు పి.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో మున్సిపల్‌ రంగానికి చెందిన బి.ఎంఎస్‌ రాష్ట్ర నాయకులు ఎంబిజి నాయుడు, దశరధ రామరాజు, ఐఎన్‌టియుసి నాయకులు వై.వి.రమణ, వెంకటరత్నంనాయుడు, గుంటూరు స్వతంత్ర సంఘం నాయకులు వరికల్లు రవికుమార్‌, ఎస్‌.శంకరరావు, మధు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.సామ్రాజ్యం, నాయకులు ఎం.డేవిడ్‌, ఎఐటియుసి నాయకులు జేమ్స్‌ పాల్గొన్నారు.




No comments:

Post a Comment