Saturday, 27 June 2015

కార్మిక హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలు...

- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు
కార్మిక హక్కులను అమలు చేయకపోగా ఉన్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని సిఐటియు నగర కార్యదర్శి ఎవి.నాగేశ్వరరావు అన్నారు. సిఐటియు విజయవాడ నగర కమిటీ విస్తృత సమావేశం దుర్గాపురంలోని సిఐటియు నగర కార్యాలయంలో గురువారం రాత్రి జరిగింది. సిఐటియు నగర కార్యదర్శి టి.ప్రభుదాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు కార్మిక సంక్షేమమే ధ్యేయమని ప్రకటించిన నాయకులు పదవీ చేపట్టిన తర్వాత కార్మికులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ కార్మికులకు సంబంధించిన అన్ని సంక్షేమ పధకాలను తొలగించి కార్మికులకు ఉపాధి, భద్రత లేకుండా చేస్తున్నారన్నారు. ప్రవేటు రంగంలోని ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌ వంటి సంస్థలను ప్రవేటీకరణ చేసేందుకు చూస్తున్నారని తెలిపారు. స్వదేశీ పేరు చెప్పిన బిజెపి ప్రభుత్వం నేడు విదేశీ కంపెనీలకు దేశ సంపదనను కట్టబెట్టే చర్యలకు దిగిందని ఎద్దేవా చేశారు. సిఐటియు నగర ప్రధానకార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కార్మిక హక్కులను కాలరాసే చర్యలు చేపడుతున్నారు. దొడ్డిదారిన కార్మిక చట్ట సవరణలు చేశారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్మిక వర్గంపై జరుగుతున్న ముప్పేట దాడులు, కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో, జులై 5న జరిగే రాష్ట్ర సదస్సుల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని కోరారు. అందుకు సిఐటియుగా కార్మికులను చైతన్య పరిచి సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. 

No comments:

Post a Comment