Saturday, 27 June 2015

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి

 ప్రభుత్వ పథకంగా ఉన్న మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని మభ్యాహ్న భోజన పధకం కార్మికుల యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపరాణి అన్నారు. మధ్యాహ్న భోజన పధకం కార్మికుల నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం దుర్గాపురంలోని సిఐటియు నగర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వరూపరాణి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు భోజనం పెట్టే పధకాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్రాలకు ఒకేసారి అందుతున్నా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదాని పట్టిస్తూ ఏజెన్సీలకు బిల్లులు నెలల తరబడి చెల్లించడం లేదని తెలిపారు. ఏడు నెలలకు పైగా ఏజెన్సీలకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏజెన్సీల నిర్వాహకులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. బిల్లులు చెల్లించక పోగా మధ్యాహ్న భోజన పధకాన్ని ఇస్కాన్‌, నాంది, అక్షయపాత్ర వంటి వాటికి ఏజెన్సీలను అప్పగించడం సరికాదన్నారు. పారిశ్రామిక వేత్తలకు పెద్దపీట వేసే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఇటువంటి చర్యలకు దిగుతున్నాయని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పధక కార్మికుల సమస్యలుగా ఉన్న కనీస వేతనం ఇవ్వాలని, బ్యాంకర్ల ద్వారా ఏజెన్సీలకు రుణాలు అందజేయాలని, బిల్లుల సకాలంలో చెల్లించాలని, గ్యాస్‌, రెండు జతల యూనిఫారం, ఇన్సూరెన్స్‌ పధకాల వర్తింపు వంటి సమస్యలపై జులైలో ఛలో కమిషనరేట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సిఐటియు నగర కార్యదర్శి ఎంవి.సుధాకర్‌ మాట్లాడుతూ స్కీమ్‌ వర్కర్లుగా ఉన్న మధ్యాహ్న భోజన పధక కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోగా ఏకంగా పధకాన్ని నిర్వీర్యం చేసే దిశగా సిఎం చర్యలు తీసుకోవడం సహేతుకం కాదన్నారు. స్కీం వర్కర్ల సమస్యల పరిష్కార క్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న సార్వత్రిక సమ్మె జరగనుందని, ఆ సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని కోరారు. సమ్మెకు సంఘీభావంగా జులై 5న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్మిక వర్గాల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్‌ నాయకురాలు ఎ.దుర్గాభవానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు సిహెచ్‌.పాపాలక్ష్మీ, వి.దుర్గాభవానీ, ఆర్‌.ప్రసన్నలక్ష్మీ, జి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 
నూతన నగర కమిటీ ఎన్నిక
2015 ఏడాదికి మధ్యాహ్న భోజన పధక కార్మికుల యూనియన్‌ (సిఐటియు) నగర నూతన కమిటీిని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా వి.దుర్గాభవానీ, కార్యదర్శిగా సిహెచ్‌.పాపాలక్ష్మీ, కోశాధికారిగా జి.రమాదేవితో పాటు ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌తో కలిపి మొత్తంగా 15 మందితో కమిటీని ఎన్నుకున్నారు.

No comments:

Post a Comment