Friday, 26 June 2015

కార్మిక సంఘాల సదస్సును జయప్రదం చేయాలి : సిఐటియు.

ఉద్యోగ, కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ జులై 5న విజయవాడ నగరంలో నిర్వహించనున్న కార్మిక సంఘాల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సిఐటియు నగర కార్యదర్శి టి.ప్రభుదాస్‌ కోరారు. గురువారం దుర్గాపురంలోని సిఐటియు నగర కార్యాలయంలో సిఐటియు సెంట్రల్‌ జోన్‌ -2 కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుదాస్‌ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరించే విధంగా పాలన సాగిస్తున్నాయని తెలిపారు. ఎన్నికలకు ముందు కార్మికులకు అనేక వరాలు గుప్పించిన పాలక పార్టీలు ఎన్నికల్లో గెలిచిన తరువాత బడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఇటువంటి తరుణంలో అన్ని కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 2వ తేదీన దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని పేర్కొన్నారు. ఈ సమ్మెకు సమాయత్తమయ్యేందుకు రాష్ట్రంలోని కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం జులై 5న నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు అన్ని రంగాల్లోని కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. పోస్టర్‌ ఆవిష్కరణలో సిఐటియు సెంట్రల్‌ జోన్‌ -2 కమిటీ ఉపాధ్యక్షులు పి.కృష్ణమూర్తి, కార్యదర్శి ఎం.బాలాజీ, పెన్షనర్ల అసోసియేషన్‌ నాయకులు మల్లంపల్లి సాంబశివరావు, షాపు గుమస్తాల సంఘం నగర నాయకులు సుబ్బారావు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రోజోలు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నాగరాజు పాల్గొన్నారు.

No comments:

Post a Comment