Monday, 22 June 2015

సమ్మెకు సిద్ధం...


- 26న మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు ఛలో విజయవాడ...
 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారని జివిఎంసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సుబ్బారావు, పి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం నండూరి ప్రసాదరావు భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి సమ్మె బాట పడుతున్నట్లు చెప్పారు. జులై 1 తర్వాత ఏ రోజు నుంచైనా సమ్మెలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గిరధర్‌కు సమ్మె నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు), ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎఐటియుసి), ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్మిక సంఘం (బిఎంఎస్‌), జాతీయ మున్సిపల్‌ కార్మికుల సంఘం (ఐఎన్‌టియుసి), గుంటూరు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (స్వతంత్ర)లు జెఎసిగా ఏర్పడినట్లు తెలిపారు. దోపిడీ ప్యాకేజీ విధానం రద్దుచేసి నేరుగా ఎస్సీ, ఎస్టీ కార్మికులకే వర్కు ఆర్డర్లు ఇవ్వాలని, కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పర్మినెంటు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లతో కూడిన వేర్వేరు అనుబంధాలను జత పరిచి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు.
          10వ పిఆర్‌సిని వెంటనే అమలు చేయాలని, జివిఎంసి, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, రాజధాని పరిధిలోని ఉద్యోగ కార్మికులకు 30 శాతం, మిగిలిన కార్పొరేషన్లలోని ఉద్యోగులకు 25 శాతం, మున్సిపాలిటీల్లో 20 శాతం, నగర పంచాయతీల్లో 15 శాతం ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2013 సమ్మె ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు జిపిఎఫ్‌ ఖాతాలు తెరిపించాలని, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని, జనాభా ప్రాతిపదికన కేడర్‌ స్ట్రెంత్‌ను పున్ణనిర్ణయించాలని కోరారు. కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల కోసం 63.344 శాతం డిఎతో 43 శాతం బేసిక్‌ ఫిట్‌మెంట్‌తో పిఆర్‌సి పే స్కేలును రూ.14,170గా నిర్ణయించి, మిగిలిన డిఎ 8.908 శాతం సహా వేతనాన్ని రూ.15,432గా బకాయిలతో సహా చెల్లించాలన్నారు. నీటి సరఫరా, వీధి దీపాలు, పార్కులు, డ్రైవర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇంజనీరింగ్‌, ఆఫీసు అవుట్‌ సోర్సింగ్‌లో క్వాలిఫైడ్‌ కార్మికులకు స్కిల్డ్‌ వేతనాలు, మిగిలిన వారికి సెమిస్కిల్డ్‌ వేతనాలను పర్మినెంటు ఉద్యోగులతో సమానంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
         కాంట్రాక్టు కార్మికులకు రూ.13,000 కనీస వేతనం జిఓ వచ్చిందని ఎఐటియుసి నాయకులు కార్మికులను మోసగిస్తున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు. వారు చెప్పేది నిజమైతే డిఎతో రూ.15,432 వేతనం కోసం ఎందుకు జెఎసిగా కలిసి వస్తున్నారని ప్రశ్నించారు. జివిఎంసిలో బయోమెట్రిక్‌ విధానం వద్దని అన్ని సంఘాలు కలిసి ఆందోళన చేయడం వల్లనే మంచి జరిగిందని సుబ్బారావు అన్నారు. వామనరావు, ఆనందరావు వ్యక్తిగత డిమాండ్లను ప్రక్కన పెట్టి జివిఎంసిలో ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని కోరారు. ఛలో విజయవాడకు సంబంధించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు డి.అప్పలరాజు, ఎన్‌.రాము పాల్గొన్నారు.

No comments:

Post a Comment