Thursday, 25 June 2015

మిషన్‌ మోడ్‌ వద్దు...

- ఐసిడిఎస్‌ను యథావిధిగా కొనసాగించాలి
- అంగన్‌వాడీల ధర్నా

 ఐసిడిఎస్‌ పరిరక్షణకు జిల్లా వ్యాప్తంగా సాగిన జీపు జాతా బుధవారం జిల్లా కేంద్రమైన చిత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్తూరు ప్రాజెక్టుకు చెందిన అంగన్‌వాడీలు గాంధీ విగ్రహం ఎదుట 'మిషన్‌మోడ్‌ వద్దు యథావిధిగా కొనసాగించాలి...' అంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సృజని మాట్లాడుతూ దేశంలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని, శిశు మరణాలను తగ్గించేందుకు ఐసిడిఎస్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ పథకాన్ని మిషన్‌మోడ్‌ పద్ధతికి మార్చడం వల్ల ఈ పథకం ఉద్దేశం నీరుగారే అవకాశం ఉందన్నారు. దీన్ని తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఐసిడిఎస్‌ పరిరక్షణకు ఈనెల 19 నుంచి చిత్తూరు నుంచి కార్వేటినగరం, జిడి నెల్లూరు, పులిచర్ల, బంగారుపాళ్యం, చిత్తూరు ప్రాజెక్టు పరిధిలోని అన్ని మండలాల్లో పర్యటించి అంగన్‌వాడీలను చైతన్య పరిచినట్లు చెప్పారు.  జీపు జాతాకు నాయకత్వం వహించిన సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య మాట్లాడుతూ ఐసిడిఎస్‌ మిషన్‌ పేరుతో అంగన్‌వాడీ సెంటర్లను మూసి వేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. దీన్ని కాపాడుకొనేందుకు అంగన్‌వాడీలు, ఆయాలతో పాటు లబ్ధిదారులు కూడా పోరాటాలకు కలసి రావాలన్నారు. మిషన్‌మోడ్‌ నిబంధనల ప్రకారం అంగన్‌వాడీ సెంటర్లు 10 శాతం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని ప్రయోత్నిస్తోందన్నారు. సిఐటియు పట్టణ కార్యదర్శి గణపతి మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్లను ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే మరో పోరాటానికి అంగన్‌వాడీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధీనంతో నడస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు గ్రామీణ స్థాయిలో సేవలందిస్తున్నాయని, ఇలాంటి కేంద్రాలను ప్రయివేటు వ్యక్తులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు సురేంద్ర, అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు జయంతి, బుజ్జి, మమత, సునీతలతో పాటు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment