Monday, 29 June 2015

అంగన్‌వాడీల ఆందోళన...

- ఐసిడిఎస్‌ను ప్రయివేటు పరం చేసే ఆలోచనకు నిరసనగా 

నెల్లూరు నిరుపేద బిడ్డలు, గర్భిణులు, బాలింతలకు ఎంతో ఆసరాగా ఉంటున్న ఐసిడిఎస్‌ను ప్రయివేటు పరం చేసే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ అంగన్‌వాడీలు సోమవారం స్థానిక దర్గామిట్టలోని ఐసిడిఎస్‌ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ ఆందోళన అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా ఆ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి మాట్లాడుతూ రాష్ట్రంలో 127 ప్రాజెక్టులను ప్రభుత్వం మిషన్‌ మోడ్‌ కింద స్వచ్ఛంద సంస్థలకిచ్చే యోచన చేస్తుందని తెలిపారు. ఇదే జరిగితే బాలింతలు, గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందదన్నారు. ఐసిడిఎస్‌ నిర్వీర్యమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలని కోరారు. ధర్నాకు మద్దతు పలికిన ఐద్వా నగర ప్రధాన కార్యదర్శి మస్తాన్‌బీ మాట్లాడుతూ ఐసిడిఎస్‌ను ప్రయివేటు పరం కాకుండా కాపాడుకునేందుకు పోరాటంలోకి రావాలన్నారు. సంస్థాగతంగానే ప్రాజెక్టులను నడపాలన్నారు. సిడిపిఒలు, పి.డి.లు అంగన్‌వాడీ మహిళలను బెదిరించి దోచుకుంటున్న అవినీతి సంపదకు అడ్డు కట్టవేయాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌తో కూడిన రిటైర్మంట్‌ బెనిఫిట్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. సర్వీసు అనంతరం వర్కర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్షను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్‌.వి.శేషమ్మ, ఆదిలక్ష్మి, మంజుల తదితర పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment