- సిఐటియు నేతలకు మంత్రి గంటా హామీ
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు 17 నెలలుగా బకాయి ఉన్న బిల్లులు, జీతాలు రాష్ట్రవ్యాప్తంగా రూ. 80 కోట్లు, విశాఖ జిల్లాలో రూ. 13.45 కోట్లు చెల్లిస్తామని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మిడ్డే మీల్స్ కార్మికులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్(సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు బి.ప్రభావతి, ప్రధాన కార్యదర్శి ఎస్.అరుణ, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.కోటేశ్వరరావు, ఎస్.రమేష్ శనివారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గత 17 నెలలుగా బిల్లులు, జీతాలు చెల్లించకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారని మంత్రి వద్ద సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో పాఠశాల కార్మికులు సుమారు రూ. 4 లక్షల వరకు అప్పులపాలై ఉన్నారని, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పథకాన్ని నడపలేని దుస్థితిలోకి నెట్టబడ్డారని తెలిపారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలు తప్ప మరో గత్యంతరం లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి గంటా, బిల్లుల విడుదలకు తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్ మట్లాడుతూ, ప్రభుత్వం పేద విద్యార్థులకు ఎంతో ఊరటగా ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్, అక్షయపాత్ర వంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే విద్యార్థులు, కార్మికులు నష్టపోతారని, ఆ ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
No comments:
Post a Comment