Friday, 21 August 2015

కార్మిక శాఖ సలహా కమిటీ లేవీ!!

కార్మిక శాఖకు సలహాలు ఇచ్చేందుకు, కనీస వేతనాలను నిర్ణయించేందుకు చట్టబద్ధంగా సలహా కమిటీ ఉండాలి. సంవత్సర కాలంగా ఆ కమిటీ నియామకానికి ప్రభుత్వం ప్రయత్ని ంచలేదు. ఈ కమిటీ లేకుండా రాష్ట్రంలో కనీస వేతనాల షెడ్యూల్‌లో ఉండే లక్షలాది మంది కార్మికులకు వేతనం పెంచే వీలు లేదు. బహశా ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని వేయడం లేదు. అలాగే ఎవాల్యూయేషన్‌, ఇంప్లిమెంటేషన్‌ కమిటీని కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేయడం సంప్రదాయం. అటువంటి కమిటీ ఇంతవరకూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద సుమారు రూ.1,100 కోట్ల నిధులు భవన నిర్మాణ కార్మిక సంక్షేమానికై నిల్వ ఉన్నాయి. పనిచెయ్యలేని దశలో, 60 సంవత్సరాల వయస్సు దాటిన వారికి ఈ నిధుల నుంచి పెన్షన్‌, ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య ఖర్చులు ఇమ్మని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నిధుల నుంచి వచ్చే వడ్డీలు పాలనాపరమైనా ఖర్చుల పేరుతో అధికారులు, మంత్రివర్యులు జల్సాలు చేయడానికి వాడుతున్నారు తప్ప నిజంగా కష్టాలలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఈ నిధిని ఖర్చు చేయడంలేదు. ఈ నిధిని పర్యవేక్షించేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీని వేయడం ప్రభుత్వ బాధ్యత. ఇంతవరకు అటువంటి కమిటీ ఏర్పాటు చేయలేదు. ఇవే కాక అనేక చట్టాల పరిధిలో ఇటువంటి సలహా కమిటీలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ముఖ్యమంత్రి అటువంటి ఆదేశాలు ఇవ్వరు. సంబంధిత మంత్రికి ఈ విషయం పట్టదు. కేవలం అధికారుల ఇష్టారాజ్యంగా వ్యవహారం నడుస్తున్నది.


No comments:

Post a Comment