Saturday, 22 August 2015

కార్మిక సంఘాల ఐక్యగళం...

- సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు రాజమండ్రి చేరిన బస్సు జాతా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు జయప్రదం చేయాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. ఆగస్టు 17న హిందూ పురం నుంచి బయలుదేరిన బస్సు జాతా శనివారం రాత్రి రాజమండ్రికి చేరుకుంది. ఈ సందర్భంగా బొమ్మన రామచంద్రరావు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రస్ట్‌ హాల్లో జరిగిన సభలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ సమాఖ్య నాయకులు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. ఈ విధానాలను సమ్మె ద్వారా తిప్పికొట్టాలన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం సెప్టెంబర్‌ 2న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. ఈ కుట్రను భగం చేయాలని కోరారు. కార్మిక చట్ట సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు, కార్మికులు ఇళ్లల్లో కూర్చోకుండా రోడ్డుపైకి రావాలన్నారు. ఎఐటియుసి రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ సింగపూర్‌ టీమ్‌ను రాష్ట్రంలో తిప్పి వారికి రాయితీలు ఇచ్చేందుకు చంద్రబాబు నానా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అసంఘటిత రంగంలో కార్మికుల వేతనాలను పెంచేందుకు ఎందుకు కృషి చేయట్లేదని 
ప్రశ్నించారు. సంక్షేమ చట్టాలను ఎందుకు అమలు చేయట్లేదన్నారు. యాజమాన్యాలకు హక్కులు కల్పించి కార్మికుల హక్కులను కాలరాసే కార్మిక సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. హుదూద్‌ తుపానులో ఎయిర్‌టెల్‌, ఐడియా వంటి సంస్థలు మూగబోయాయని, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఒక్కటే పనిచేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకులు, ఎల్‌ఐసి ఉండబట్టే ప్రజల పొదుపునకు రక్షణ ఉందన్నారు. ఇవి ప్రయివేటు పరం చేస్తే ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ప్రజాధనాన్ని కార్పొరేట్‌, విదేశీ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రను సమ్మె ద్వారా ప్రజలు భగం చేయాలన్నారు. సమ్మె చేస్తే రూ.6లక్షలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధించే చట్టాలు రాబోతున్నాయన్నారు. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కార్మిక శాఖను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. కార్మికులను బానిసలుగా మార్చేందుకు కుట్రలు పన్నితే కార్మికవర్గం చూస్తూ ఊరుకోదన్నారు. తొలుత సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్‌ వివిధ కార్మిక సంఘాల నాయకులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సభలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మీసాల సత్యనారాయణ, బిబి.నాయుడు, జి.వెంకటేశ్వర్లు, ఎడి కామాచార్యులు, జెవి సుందరరామరాజు, కె.రామారావు, వి.వెంకటేశ్వరరావు, సత్యకుమార్‌, దాసరి ప్రసాదరావు, వి.సతీష్‌, కిర్ల కృష్ణ, ఎస్‌ఎస్‌ మూర్తి, గణపతి, సత్యానందం, లకీëపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన అభ్యుదయ గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

No comments:

Post a Comment