Thursday, 6 August 2015

అంగన్‌వాడీ వేతనాల పెంపు....

అంగన్‌వాడీలు చేస్తున్న పోరాటం ఫలించింది. అంగన్‌వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీతాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వర్కర్లకు రూ. 4200 నుంచి రూ. 7100 వరకు, హెల్పర్లకు రూ. 2200 నుంచి రూ. 4600 వరకు, మినీ అంగన్‌వాడీలకు రూ. 2950 నుంచి రూ. 4600 వరకు పెంచినట్టు వెల్లడించింది. కొత్త వేతనాలు సెప్టంబర్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయి. తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతూ జీవనం సాగిస్తున్న తమకు వేతనాలు కనీసం రూ. 15 వేలకు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉధృత పోరాటం సాగించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల సమయంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను, ఆంక్షలను విధించినప్పటికీ లెక్క చేయకుండా వేలాది మంది అంగన్‌వాడీలు హైదరాబాద్‌లో కదం తొక్కారు. పోరాటం ఉదృతంగా సాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేతనాలు పెంచుతామని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. అంగన్‌వాడీ నేతలతో చర్చలు కూడా జరిపి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత సభ్యులుగా ఒక కమిటీనే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గతంలో రెండు సార్లు భేటీ అయినా ఆశించిన ఫలితాలు వెలువడలేదు. కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అంగన్‌వాడీలు మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేప ట్టారు. బుధవారం కూడా ఇదే అంశం మీద సిఎంవో అధికారులను, స్త్రీ శిశు సంక్షేమ అధికారులను కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 17న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో గురువారం భేటీ అయిన మంత్రి వర్గ ఉపసంఘం వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటిం చింది. అయితే హెల్పర్లకు ఇవ్వాల్సిన రూ. 2950 ల్లో రూ. 750 గత కొన్ని నెలలుగా చెల్లించడం లేదు. ఈ బకాయిల మీద ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వ లేదు. 

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ తర్వాత చూద్దాం :మంత్రులు
అంగన్‌వాడీలకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ గురించి ప్రస్తుతం ఏమీ ఆలోచన చేయలేదని, దాని మీద కూడా త్వరలో చర్చలు జరుపుతామని మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత తెలిపారు. భేటీ అనంతరం వారు సచివాలయంలో మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 4200 నుంచి రూ. 7100 వరకు, హెల్పర్లకు రూ. 2200 నుంచి రూ. 4600 వరకు, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 2950 నుంచి రూ. 4600 వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. కొత్తగా పెంచిన వేతనాలు సెప్టంబర్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారు. పెరిగిన వేతనాల వల్ల ప్రభుత్వానికి రూ. 317 కోట్లు భారం అధనంగా పడుతుం దన్నారు. అయితే చెల్లించాల్సిన బకాయిల మీద మంత్రులు మాట్లాడకపోవడం గమనార్హం. 

పెంచిన వేతనాలు గత ఏప్రిల్‌ నుంచి ఇవ్వాలి
అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌
అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాల పెంపుదల పట్ల ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించిందని, యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి బేబిరాణి, పి రోజా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చిలో ఆందోళన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినందున 2015 ఏప్రిల్‌ నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వేతనాల పెంపులో మినీ వర్కర్లకు కేవలం రూ.1650 మాత్రమే పెంచారని, మెయిన్‌ వర్కర్స్‌కు మాదిరిగానే వారికీ వేతనం పెంచాలని కోరారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌పైనా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీలపై పెరిగిన పని భారం, ఐసిడిఎస్‌తో సంబంధంలేని అదనపు పనులు తదితర సమస్యలున్నందున యూనియన్లను చర్చలకు పిలిచి, వాటినీ పరిష్కరించాలని, పెరిగిన వేతనాలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు.

No comments:

Post a Comment