Friday, 21 August 2015

సొమ్ము కార్మికులది....సోకు చంద్రబాబుది

ప్రమాదంలో చనిపోయే డ్రైవర్లందరికీ రూ.5 లక్షల పరిహారం చెల్లించేట్లు ముఖ్యమంత్రి గొప్ప నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రవ్యాప్తంగా బస్సులపైన అడ్వర్టైజ్‌మెంట్లు, హోర్డింగ్స్‌ ద్వారా ఊదరగొట్టుడు ప్రచారం ప్రభుత్వం చేస్తున్నది. కానీ ఆచరణలో ఈ పథకానికి డ్రైవింగ్‌ లైసెస్సుతో పాటు, బ్యాడ్జి కూడా ఉండాలనే నిబంధన పెట్టడంతో నూటికి 70 మంది డ్రైవర్లకు ఇది వర్తించడం లేదు. ప్రమాద బీమాలో గాయపడి ఆస్ప్రతిలో ఉన్నవారికి కూడా ఖర్చులు భరించేట్లుగా పథకం ఉండాలని కార్మికులు కోరుతూ ఉంటే చనిపోతేనే పరిహారం వచ్చేలా ప్రభుత్వం స్కీంను తయారు చేసింది. సహజ మరణానికి ఏ సహాయం ఉండదు. కార్మికులు బతకడం కంటే తొందరగా చచ్చిపోవాలని కోరుతున్నట్లుగా ప్రభుత్వ పథకం ఉన్నది. ఈ పథకానికి ప్రభుత్వం నిధులు ఇచ్చింది లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.11 కోట్లు డ్రా చేసి బీమా కంపెనీ ప్రీమియంను ప్రభుత్వం చెల్లించింది. అంటే డబ్బు కార్మికులది ప్రచారం చంద్రబాబుది. ఇంతే కాదు చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పంలో భవన నిర్మాణ రంగానికి సంబంధించిన కేంద్రం ఏర్పాటుకు రూ.17.50 కోట్లు ఈ నిధుల నుంచే విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కాకుండా పాలకుల ప్రచారానికి ఈ విధంగా నిధులు వాడటం దుర్వినియోగం కాదా?

No comments:

Post a Comment